2007: Buyers lose in big budget films
January 1st, 2008

అగ్ర కథానాయకుల చిత్రాలు, క్రేజీ కాంబినేషన్ సినిమాలు సిరులు కురిపిస్తాయనే నమ్మకంతో వాటిని కొనేందుకు బయ్యర్లు అమితాసక్తి చూపిస్తుంటారు. అయితే 2007లో బయ్యర్లు, నిర్మాతలను ముంచిన వాటిలో ఈ తరహా సినిమాలే ఎక్కువగా ఉండడం గమనార్హం. కోటి ఆశలతో ఎక్కువ రేటుపెట్టి కొన్న ఆ సినిమాలు కోట్లలో నష్టాల్ని తీసుకు రావడంతో వాళ్లు లబో దిబోమంటున్నారు. మినిమం గ్యారంటీ హీరోగా బయ్యర్లు గట్టిగా నమ్మే చిరంజీవి సైతం కొంతకాలంగా వారిని అడపాదడపా మినహా ఎక్కువ సంతృప్తి పరచలేక పోతున్నారు. ఈ సారి ఆయన 'శంకర్‌దాదా జిందాబాద్'తో పంపిణీదారులను బాగా నిరుత్సాహ పరిచారు. బాలీవుడ్ సూపర్‌హిట్ ఫిల్మ్ 'లగే రహో మున్నాభాయ్'కి రీమేక్‌గా ఈ సినిమాని నిర్మించిన జెమిని ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ.. దీనికి హైప్ క్రియేట్‌చేసి, సినిమాని భారీ రేట్లకి అమ్ముకుంది. అయితే అందుకు విరుద్ధంగా కలెక్షన్లు తీసికట్టుగా రావడంతో పలు ప్రాంతాలలో బయ్యర్లు భారీ నష్టాల్ని చవిచూశారు.
బాలకృష్ణ హీరోగా నటించిన 'మహారథి' పరిస్థితి చెప్పనలవికాదు. బయ్యర్లతో బాటు నిర్మాతని కూడా నిండా ముంచేసింది ఆ సినిమా. 'చంద్రముఖి' వంటి సూపర్‌హిట్ సినిమాని డైరెక్ట్ చేసిన పి. వాసు ఈ సినిమాకి దర్శకుడు. కానీ సినిమాకి అదేమీ ఉపకరించలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఫలితంగా నిర్మాత వాకాడ అప్పారావు, బయ్యర్లు కోలుకోలేని రీతిలో భారీగా నష్టపోయారు.
మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన 'అతిథి' సినిమా సైతం మొదట్లో మంచి వసూళ్లను సాధించినా ఆ తర్వాత బాక్సాఫీసు వద్ద బాగా నెమ్మదించింది. ఆ సినిమా రాష్ట్రవ్యాప్త హక్కులు తీసుకున్న యుటివి మోషన్ పిక్చర్స్, దానినుంచి పంపిణీ హక్కులు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కనీసం 35 శాతం నష్టాల్ని పొందినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2006లో 'సైనికుడు' వంటి డిజాస్టర్ తర్వాత మహేష్ ఎదుర్కొన్న మరో ఫ్లాప్ ఇది.
ప్రభాస్ నటించిన రెండు సినిమాలు సినీ వర్గాలతో బాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తించాయి. కానీ విడుదలయ్యాక ఆ రెండూ వారి అంచనాల్ని అందుకోలేక పోయాయి. అవి.. 'యోగి', 'మున్నా' చిత్రాలు. వీటిలో బయ్యర్లను, నిర్మాతలను ఎక్కువ నిరుత్సాహ పరిచింది వినాయక్ డైరెక్ట్ చేసిన 'యోగి'. దిల్ రాజు నిరించిన 'మున్నా' సైతం బయ్యర్లకు నష్టాల్ని మిగిల్చింది.
2007లో అన్నిటికంటే అనూహ్యమైన అపజయాన్ని పొందిన చిత్రంగా 'జగడం'ను పేర్కొనాలి. 'ఆర్య' దర్శకుడు సుకుమార్, 'దేవదాసు' హీరో రామ్ కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్టుగా వచ్చిన ఈ సినిమా అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ డిజాస్టర్ అయ్యింది. రామ్ మార్కెట్ వాల్యూని మించి చాలా ఎక్కువ వ్యయం అయిన ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతకు నష్టాన్ని కలిగించి, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లను ముంచింది.
వీటిలాగే నిర్మాతలను, బయ్యర్లను బాగా నష్టపరిచిన సినిమాల్లో కల్యాణ్‌రాం సినిమాలు 'విజయడశమి', 'లక్ష్మీ కల్యాణం', ఉదయ్‌కిరణ్ చిత్రం 'వియ్యాలవారి కయ్యాలు', నితిన్ సినిమా 'టక్కరి', గోపీచంద్ చిత్రం 'ఒక్కడున్నాడు', మనోజ్ 'రాజుభాయ్', శ్రీహరి 'శ్రీమహాలక్ష్మి', సుమంత్ 'క్లాస్‌మేట్స్', ప్రియదర్శిని రామ్ 'టాస్' తదితర సినిమాలున్నాయి.
పెరిగిన నిర్మాణ వ్యయానికి తోడు సరైన ప్లానింగ్ లేకుండా  ఎక్కువ ఖర్చు చేయడం కూడా వీటికి ఎక్కువ నష్టాల్ని తీసుకొచ్చాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నిర్మాతలు హీరో ఇమేజ్ లేదా కాంబినేషన్ క్రేజ్‌ని సొమ్ము చేసుకుందామనే పద్ధతిని విడనాడి అందరూ సంతోషంగా ఉండాలనే భావనతో పక్కా ప్లానింగ్ ప్రకారం సినిమాల్ని నిర్మించి అమ్మితే చిత్ర పరిశ్రమకు ఇన్ని కష్టాలు ఉండవు.
..యజ్ఞమూర్తి

Give your Rating Here :
Average Rating: 3.17    Votes: 3
 
Featured Most Popular
 
 
Movies Actress Actor Events