Allu Arjun's PARUGU for victory
March 28th, 2008
ఒకరు క్రేజీ హీరో.. మరొకరు ఒకే సినిమాతో యావదాంధ్ర దేశం మెప్పుపొందిన డైరెక్టర్.. ఇంకొకరు సంచలన నిర్మాత.. ఈ ముగ్గురూ ఒకే చిత్రానికి కలిసి పనిచేస్తే?.. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తడం ఖాయం. 'పరుగు' చిత్రం సరిగ్గా ఇటువంటి ఆసక్తినే తెలుగునాట కలిగిస్తున్నది. అల్లు అర్జున్ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నిర్మిస్తున్నారు. 'సీతాకోకచిలుక', 'హలో ప్రేమిస్తారా!' చిత్రాల షీలా ఇందులో నాయిక. మొన్నటి 'ఆర్య', 'బన్ని', నిన్నటి 'దేశముదురు' చిత్రాలతో యువతలో అర్జున్ మంచి క్రేజ్‌ను సంపాదించాడు. 2007 జనవరిలో వచ్చిన 'దేశముదురు' తర్వాత కొంత గ్యాప్ తీసుకుని అతను చేస్తున్న సినిమా ఇదే. 'దేశముదురు'లో కండలు తిరిగిన దేహంతో, టాప్‌లెస్‌గా అతడు కనిపించిన సన్నివేశాలు యువతను వెర్రెత్తించాయి. అందులో అతడి డైలాగ్ మేనరిజం, ఎంతో ఈజ్‌తో ఒక కొరియోగ్రాఫర్ మాదిరిగా అతడు చేసిన డాన్సులు అందర్నీ అలరించాయి.
ఆ సినిమా తర్వాత ఎటువంటి కథల్ని ఎంచుకోవాలనే సంగతిని అతడు గ్రహించాడు. అందుకే సుకుమార్ ఆఫర్ చేసిన 'జగడం'ను సున్నితంగా తిరస్కరించాడు. అది వర్కవుట్ అయ్యే సబ్జెక్ట్ కాదని అతడు ముందే గ్రహించాడు. అందుకు తగ్గట్లే రామ్ హీరోగా నటించిన ఆ చిత్రం అట్టర్ ఫ్లాపయింది. 'పరుగు'తో మరో భారీ విజయాన్ని సాధించగలననే నమ్మకం అర్జున్‌లో వ్యక్తమవుతోంది. ఎటువంటి సందేశాలు ఇవ్వకుండా ప్రేక్షకుల్ని వినోదింప జేయాలనే లక్ష్యంతో చేస్తున్న సినిమా 'పరుగు'. ఇంతదాకా తను చేసిన పాత్రలన్నింటికంటే క్లిష్టమైంది ఈ సినిమాలోని పాత్రేనని అర్జున్ చెబుతున్నాడు. నిర్మాత దిల్ రాజు సైతం ఇదే సంగతిని చెబుతారు. "అర్జున్‌లోని నటనా సామర్థ్యం ఏమిటనేది ఈ చిత్రంతో మరింత బాగా తెలుస్తుంది" అంటారాయన. 
'పరుగు' అనే టైటిల్‌లోనే వేగం కనిపిస్తుంది. సినిమా సైతం అలాగే వుంటుందా? అవుననేది భాస్కర్ సమాధానం. 'పరుగు'లోని అర్జున్ చేసే పాత్రలో హీరోయిజం, ఎమోషన్, యాక్షన్, సెంటిమెంట్.. అన్నీ వున్నాయన్నది అతని మాట. అర్జున్ అభిమానుల్నీ, మాస్, క్లాస్ ప్రేక్షకుల్నీ ఆకట్టుకునే అన్ని అంశాలూ ఇందులో వున్నాయని అతనంటాడు. 'పరుగు'కి సంగీతం ఒక ఎస్సెట్ కానున్నది. ఒక్కో పాటని ఒక్కోవిధంగా మణిశర్మ ఆరు పాటలకు బాణీలు కట్టాడు. ఆ పాటల్ని ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారని నిర్మాత రాజు అంటారు. ఆయనకూ, దర్శకుడు భాస్కర్‌కూ బాగా ఇష్టుడైన నటుడు ప్రకాష్‌రాజ్ ఈ సినిమాలోనూ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఆయన పాత్ర ప్రేక్షకుల్ని ఆశ్చర్య పరచడమే కాదు, ఆకట్టుకుంటుందని వారంటారు.
ఈ సినిమాలో రెండో హీరోయిన్ కూడా వుంది. ఆ పాత్రను పూనమ్ బజ్వా చేస్తోంది. 'బొమ్మరిల్లు' చిత్రంతో భాస్కర్ తెలుగువాళ్ల గుండెల్లో బొమ్మరిల్లు కట్టేశాడు. 'పరుగు'తో ఆ ఖ్యాతిని మరింత పెంచుకోవాలనే తపనతో అతనున్నాడు. వ్యయానికి వెనుకాడకుండా దిల్ రాజు ఈ సినిమాను ఉన్నతస్థాయి విలువలతో నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో విడుదల కానున్న 'పరుగు'తో అర్జున్‌ను ప్రేక్షకులు ఏవిధంగా ఆదరిస్తారో వేచి చూడాలి.
..యజ్ఞమూర్తి
Give your Rating Here :
Average Rating: 4.63    Votes: 4
 
Featured Most Popular
 
 
Movies Actress Actor Events