2007: Director gains upper hand
December 29th, 2007
తెలుగు సినిమా సమీక్ష.. 2007
దశాబ్దాల నుంచి హీరో ఆధారంగా ముందుకు సాగుతున్న తెలుగు సినిమా కొత్త మలుపు తీసుకోవడానికి 2007లో బీజం పడింది. హీరో మీద దర్శకుడు పైచేయి సాధించడం ఈ యేడాది విశేషం. ప్రేక్షకులు ఆదరించిన, విమర్శకులు ప్రశంసించిన సినిమాలలో అధిక శాతం దర్శకులకు బాగా పేరు తెచ్చినవే. అంతే కాదు.. ఈసారి బాగా కొట్టొచ్చినట్లు కనిపించిన అంశం.. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలకు భిమ్మమైన ఇతివృత్తాలతో వచ్చిన సినిమాలే ఎక్కువగా ప్రజాదరణ పొందడం. నిస్సందేహంగా ఇది తెలుగు సినిమాకి సంబంధించి శుభ పరిణామం. బాలీవుడ్ రెండేళ్ల క్రితమే ఈ మార్పుని స్వాగతించగా, ఇప్పుడు దాన్ని టాలీవుడ్ అందిపుచ్చుకుంటోంది. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలలో ఈసారి ప్రేక్షకులు బాగా ఆదరించిన వాటిలో 'దేశముదురు', 'లక్ష్యం', 'తులసి' మాత్రమే ఉన్నాయి. 'దుబాయ్ శీను' ఫర్వాలేదన్నట్లు ఆడింది.
కొత్త సినిమాకు 'హ్యాపీడేస్':
మూవీ ఆఫ్ ద ఇయర్ 2007.. అంటే ఎవరైనా ఠక్కున చెప్పే జవాబు 'హ్యాపీడేస్'. నిజంగా కొత్త ఆలోచనలకు, కొత్త సినిమాకు 'హ్యాపీడేస్' ద్వారాలు తెరిచింది. వెకిలి చేష్టలు, బూతు సంభాషణలు, పిచ్చి గంతులు, కత్తులతో బీభత్సంగా నరుక్కోవడాలు, లెక్చరర్లను బఫూన్లుగా చూపించడాలు.. వంటివేమీ లేకుండా చూస్తున్నంత సేపూ హాయినీ, ఆహ్లాదాన్నీ కలిగిస్తూ, కాలేజీ జీవితంలోని రకరకాల రుచుల్ని అందించిన ఫీల్‌గుడ్ మూవీగా 'హ్యాపీడేస్' చరిత్రలో నిలుస్తుంది. దాన్ని రూపొందించిన దర్శకుడు శేఖర్ కమ్ముల సమకాలీన తెలుగు దర్శకుల్లోని అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుల్లో ఒకడిగా నిలుస్తాడు. ఈ సినిమాతో దర్శకుడికి అమాంతం గౌరవం పెంచాడాయన. 'ఆనంద్', 'గోదావరి' సినిమాలతో ఇప్పటికే తానేమిటో నిరూపించుకున్న ఆయనను ఇప్పుడు చాలామంది దర్శకులు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. 'హ్యాపీడేస్' సంగతి అలా ఉంచితే.. ఈ యేడాది విజయం సాధించిన లేదంటే ప్రశంసలు పొందిన సినిమాల్లో వివిధ తరహాలకు చెందినవి ఉండడం గమనార్హం. వాటిలో ఫ్యామిలీ సినిమాలు, సోషియో ఫాంటసీలు, కామెడీలు, పొలిటికల్ డ్రామాలు, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్లు ఉన్నాయి. ఇన్ని రకాల సినిమాలు ఒకే యేడాది ప్రేక్షకాదరణ పొందడం కూడా చెప్పుకోదగ్గ విషయమే.
థ్రిల్లర్లకు రోజులొచ్చాయి:
అప్పుడప్పుడు థ్రిల్లర్లు ఆడిన సందర్భాలు ఉన్నాయి కానీ స్వల్పకాలంలో ఎక్కువ థ్రిల్లర్లు ఆడిన సందర్భం మాత్రం ఇప్పుడే. 'ఐతే', 'అనుకోకుండా ఒకరోజు', 'ఎ ఫిల్మ్ బై అరవింద్' వంటి సినిమాల స్ఫూర్తితో ఈ యేడాది కొన్ని థ్రిల్లర్లు వచ్చాయి. వాటిలో ఒక్క డిసెంబర్‌లోనే వచ్చిన 'మంత్ర', 'అనసూయ' చిత్రాలు ప్రేక్షకుల్ని ఉత్కంఠతతో ఉక్కిరిబిక్కిరి చేసి చక్కని ఆదరణని పొందుతున్నాయి. వీటికంటే ముందు ఇదే యేడాది మరికొన్ని థ్రిల్లర్లు వచ్చినా సన్నివేశాల కల్పనలోనో, కథన లోపాల కారణంగానో సరిగా ఆడలేక పోయాయి. వాటిలో వంశీ తీసిన 'అనుమానాస్పదం'తో బాటు 'అతడెవరు?', 'కొత్త కథ' వంటివున్నాయి. 'మంత్ర', 'అనసూయ' సినిమాలు రెండూ ఖచ్చితంగా దర్శకుల సినిమాలే. వాటిలో సన్నివేశాల్ని కల్పించిన తీరూ, కథని నడిపించిన విధానం ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఫలితంగానే 'మంత్ర' దర్శకుడు తులసీరామ్ ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకట్టుకోగా, ఫ్లాపుల్లో ఉన్న రవిబాబు సైతం 'అనసూయ'తో తనలో ప్రతిభకు కొదవలేదని నిరూపించుకున్నట్లయింది.
మిగతా సినిమాల్లో రెండు పొలిటికల్ డ్రామాలు బాగున్నాయని పేరు తెచ్చుకున్నాయి. పోసాని కృష్ణమురళి డైరెక్ట్ చేసిన 'ఆపరేషన్ దుర్యోధన' అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ పెద్ద విజయం సాధించి ఆశ్చర్య పరచింది. పోసానికి దర్శకుడిగా ఇమేజ్‌ని తీసుకొచ్చింది. రాజశేఖర్ నటించిన 'ఎవడైతే నాకేంటి' సినిమా కూడా రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థలోని లోపాల్ని కడిగి వేసేదే. అయితే అది మలయాళ సినిమా 'లయన్' ఆధారంగా రూపొందింది. జీవిత, వి. సముద్ర సంయుక్తంగా దానికి దర్శకత్వం వహించారు.
'యమలీల', 'ఘటోత్కచుడు' వంటి సోషియో ఫాంటసీ చిత్రాల తర్వాత వచ్చిన ఆ తరహా సినిమాలేవీ ఇటీవలి కాలంలో ఆడినట్లు కనిపించదు. 2007లో రెండు సోషియో ఫాంటసీలు ప్రేక్షకుల్ని అలరించాయి. వాటిలో ఒకటి ఎన్టీఆర్ వంటి క్రేజీ హీరో నటించిన 'యమదొంగ' కాగా, మరొకటి శ్రీకాంత్, వేణు నటించిన 'యమగోల.. మళ్లీ మొదలైంది'. వీటిలో మొదటిదాన్ని రాజమౌళి, రెండోదాన్ని శ్రీనివాసరెడ్డి రూపొందించారు.
అలాగే 'ఢీ' వంటి కామెడీ మిళితమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి ప్రేక్షకులు పట్టం కట్టారు. గ్యాంగ్‌స్టర్ కథని కొత్త కోణంలో ఆవిష్కరించడం వల్లే ఇది సాధ్యపడింది. అంతవరకు హిట్టంటూలేని హీరో విష్ణుకి 'ఢీ'తో హిట్టిచ్చిన ఘనతని దర్శకుడు శ్రీను వైట్ల చేజిక్కించుకున్నాడు. ఒక ప్రేమ కథకి గ్రామీణ నేపథ్యాన్నీ, కుటుంబంలోని ఆత్మీయతానుబంధాల్నీ మిళితం చేసి చాలా కాలం తర్వాత విజయం సాధించాడు కృష్ణవంశీ. అంతగా పేరులేని తారలతో ఆయన తీసిన 'చందమామ' చిత్రం మొదట వచ్చిన బ్యాడ్ టాక్‌ని తట్టుకుని విజయం సాధించింది. ఇక మనం విస్మరించకూడని సినిమా ఒకటుంది. అది హీరో వెంకటేష్ ఈయేటి మేటి హీరోగా నిలిచేందుకు కారణమైన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రం. ప్రేమకథకి గుండెల్ని పిండే తండ్రి సెంటిమెంటుని కలిపి తీసిన ఈ సినిమాని కుటుంబ ప్రేక్షకులతో బాటు యువత కూడా దండిగా చూశారు. ఆ క్రెడిట్ ఆ సినిమాని డైరెక్ట్ చేసిన సెల్వ రాఘవన్‌దే.
అలక్ష్యం చేస్తే అపజయం తప్పదు:
కథనీ, కథనాన్నీ అలక్ష్యం చేస్తే, ప్రేక్షకుల అభిరుచుల్ని పట్టించుకోక పోతే పరాజయం తప్పదని పేరుపొందిన సినిమాలు, క్రేజీ సినిమాలు స్పష్టం చేశాయి. హీరో ఎంతటివాడైనా సినిమా తాము ఆశించిన రీతిలో లేకపోతే, తమను తక్కువ అంచనా వేస్తే సహించమని ప్రేక్షకులూ తేల్చారు. అందుకే చిరంజీవి 'శంకర్‌దాదా జిందాబాద్', బాలకృష్ణ 'మహారథి', నాగార్జున 'డాన్', మహేష్‌బాబు 'అతిథి', ప్రభాస్ 'యోగి' సినిమాలు మట్టికరిచాయి. లక్ష్మీ కల్యాణం, క్లాస్‌మేట్స్, శ్రీ మహాలక్ష్మి, రాజుభాయ్, టాస్, విజయదశమి, వియ్యాలవారి కయ్యాలు, టక్కరి సినిమాలూ అదే దారి పట్టాయి. ఇవన్నీ మూసపోసిన కథలతో వచ్చినవో, లేదంటే పాత్రలు, కథనం పట్ల అశ్రద్ధ వహించినవో కావడం గమనార్హం. కొత్తగా తీద్దామని మనిషిలోని మృగ కోణాన్ని ఎలివేట్ చేస్తూ సినిమా తీస్తే సహించేది లేదని 'జగడం'ని తిరస్కరించడం ద్వారా తెలిపారు ప్రేక్షకులు. 'ఆర్య'తో ప్రతిభావంతుడైన దర్శకుడిగా అందరి దృష్టినీ ఆకర్షించిన సుకుమార్ దీనితో ఖంగు తినక తప్పలేదు.
ఏదేమైనా తెలుగు ప్రేక్షకులు తెలివైనవారు. దేన్ని హిట్ చేయాలో, దేన్ని చేయకూడదో వారికి బాగా తెలుసు. వారి నాడిని తెలుసుకుంటూ సినిమాలు తీసేవారూ, వారి అభిరుచుల్ని పెంపొందించేవారూ విజయాలు సాధిస్తుంటారు, అప్పుడప్పుడూ ఎదురుదెబ్బలు తగిలినా. 2007 సంవత్సరం దానికి సజీవ సాక్ష్యం.
..యజ్ఞమూర్తి

| Give your Rating Here : |
Average Rating: 2.75
Votes: 2
|
News | Box Office | Previews | Reviews | Trailers | Galleries | Wallpapers | Events | Videos | Audio Songs
©2006 - 2008 Chitramala.com - Movies, Hollywood, Bollywood, Music, News, Photos, Videos - All rights reserved.