

బాలీవుడ్‌లో అలనాటి 'డాన్', నిన్నటి 'డాన్'.. ఇద్దరూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తొలి 'డాన్'గా అమితాబ్ దేశవ్యాప్త ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తే, విమర్శల్ని తట్టుకుని ఆధునిక 'డాన్'గా షారుక్‌ఖాన్ సైతం నేటి యువతని అలరించాడు. ఇప్పుడు తెలుగులో తొలి 'డాన్' ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే హిందీ 'డాన్'లకీ, ఈ 'డాన్'కీ పోలిక లేదు. హిందీలో డాన్ ఫక్తు మాఫియా సామ్రాజ్యనేతగా కనిపిస్తే, అందుకు విరుద్ధంగా తెలుగు డాన్ సామాన్య ప్రజలకు సన్నిహితమైన వ్యక్తిగా దర్శనమిస్తాడు. ఆ 'డాన్'గా నాగార్జున దర్శనమివ్వనున్నాడు. ఇదివరకు ఆయనను 'మాస్'గా చూపించిన దర్శకుడు రాఘవ లారెన్స్ ఇప్పుడు 'డాన్'గా ప్రెజెంట్ చేశాడు. డాన్ పాత్రలో నాగార్జున ప్రేక్షకుల్ని మెప్పిస్తాడా, లేదా అని ట్రేడ్ వర్గాలు, సినీ వర్గాలతో బాటు ఇతర సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కొత్త రూపంతో నాగార్జున:
ఇదివరకు 'గీతాంజలి', 'సూపర్' సినిమాల్లో పొడవాటి జుట్టుతో కనిపించిన నాగార్జున మరోసారి ఆ తరహా జుట్టుతో 'డాన్'గా కనిపించనున్నాడు. సీనియర్ హీరోలందరిలోనూ చార్మింగ్ హీరోగా పేరుపొందిన ఆయన నుంచి సరైన కమర్షియల్ హిట్‌వచ్చి మూడేళ్లయిపోయింది. 2001లో విడుదలైన నాలుగు సినిమాలు.. 'ఎదురులేని మనిషి', 'బావనచ్చాడు', 'ఆకాశవీధిలో', 'స్నేహమంటే ఇదేరా'.. వరుసగా ఫ్లాపై క్లిష్ట స్థితిని ఎదుర్కొన్న నాగార్జున, ఆ తర్వాత 2002 నుంచి 2004 వరకు వరుసగా 5 హిట్లిచ్చి తన అగ్రస్థాయి హీరో ఇమేజ్‌ని నిలబెట్టుకున్నాడు. ఆ 5 సినిమాలు.. సంతోషం, మన్మథుడు, శివమణి, నేనున్నాను, మాస్. మళ్లీ ఇంతవరకు ఆయన మాస్ ప్రేక్షకుల్ని అలరించలేదు. 'సూపర్' (2005), 'శ్రీరామదాసు', 'బాస్' (2006) సినిమాలలో 'శ్రీరామదాసు' నటునిగా ఆయనకు చక్కని పేరు తీసుకువచ్చినా నిర్మాతకు లాభాల్ని మాత్రం అందించలేక పోయింది. 'సూపర్' ఓ మోస్తరుగా ఆడగా, 'బాస్' అన్ని రకాలుగా నిరాశపర్చింది. ఆ సినిమా వచ్చి యేడాదిపైగా గడచింది. ఇలాంటి నేపథ్యంలో 'డాన్' సినిమా వస్తోంది. 'మాస్' కాంబినేషన్ మ్యాజిక్ ఈ సినిమాతో రిపీట్ అవుతుందని నాగార్జున అభిమానులు ఆశిస్తున్నారు. ల్యాండ్ మాఫియా నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో తన సాయం కోసం ఎవరు వచ్చినా మరో ఆలోచన లేకుండా సాయపడే రాబిన్‌హుడ్ తరహా పాత్రని నాగార్జున చేశాడు. దానివల్ల ఆయన ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొని, వాటిని అధిగమించాడనేది కథ. ఈ పాత్రలో రాణించి పూర్వ వైభవాన్ని నాగార్జున సాధిస్తాడా? లెటజ్ వెయిట్ అండ్ సీ.
యజ్ఞమూర్తి
| Give your Rating Here : |
Average Rating: 1.50
Votes: 2
|

























