Favours and adverses of Chiranjeevi
June 17th, 2008
చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే ఆయనకు కలిసొచ్చే అంశాలేమిటి? ఆయనకు ప్రతికూలంగా మారే సంగతులేమిటి? అనే దానిపై రాజకీయ విశ్లేషకులు పరిశీలనలు జరుపుతున్నారు. వారి పరిశీలనలో ఆయనకు ఎన్ని అనికూలతలు వున్నాయో, అన్ని ప్రతికూలతలూ వున్నాయని స్పష్టమవుతోంది.
అనుకూలతలు:
* ఆయనకు ప్రజల్లో 'మెగాస్టార్' స్థాయి పలుకుబడి, ప్రచారం వుంది. ఆయనకు లక్షల సంఖ్యలో అభిమానులున్నారు.
* సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన ఇప్పటికే ప్రచారం పొందారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలువురికి ప్రయోజనం కలిగింది. దాని ద్వారా ఎంతోమందికి రక్త దానం చేశారు.
* రాష్ట్రంలో బలమైన కాపు కులానికి చెందిన వ్యక్తి. రాష్ట్రమంతా విస్తరించి వున్న కాపు, నాయుడు, బలిజ, శెట్టి బలిజ కులాలు ఆయనకు కొమ్ముకాసే అవకాశాలు ఎక్కువ.
* అగ్ర నటునిగా రెండు దశాబ్దాల నుంచి తిరుగులేకుండా రాణిస్తున్నా గర్వం, అహంకారం లేని సౌమ్యుడిగా పేరు. 
* రాష్ట్రమంతటా ఆయనకు అపారంగా అభిమానులున్నారు. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ఆయన అభిమానులెక్కువ. యువతరానికి ఆయన ఆరాధ్యనటుడు.
* కాపులు అధిక సంఖ్యలో వున్న ఉభయ గోదావరి జిల్లాల్లో ఓటర్లు ఆయనకు పట్టం కట్టే అవకాశాలెక్కువ.
* వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ వున్నవాడు కాబట్టి తటస్థ ఓటర్లు ఆయనకు ఓట్లు వేయవచ్చు.
* కాంగ్రెస్, తెలుగుదేశం పాలనల్ని చూశారు కాబట్టి, ఒకసారి చిరంజీవికీ అవకాశం ఇద్దామని ప్రజలు భావించవచ్చు.
ప్రతికూలతలు:
* కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ సంస్థాగత కేడర్ వుంది. కాబట్టి చిరంజీవికి ఆ స్థాయి కేడర్ తయారవడం అంత సులభం కాదు.
* జనం ఇప్పటికే కాంగ్రెస్, టిడిపి ఓటు బ్యాంకులుగా చీలిపోయి వున్నారు. కాబట్టి చిరంజీవి పూరించే రాజకీయ శూన్యం ఇప్పుడేమీ లేదు.
* కాపులు కాకుండా ఇతర కులాల్లో ఆయన ఓటు బ్యాంకులు తయారవడం అంత ఈజీ కాదు.
* వ్యక్తిగతంగా ఆయన వివాద రహితుడైనా, ఆయన కుటుంబంలోని వ్యక్తులు వివాదాల్లో చిక్కుకోవడం ఆయనకు ఇబ్బందికరం. ఆయన పెద్ద కుమార్తె సుస్మితకు హీరో ఉదయ్‌కిరణ్‌తో జరిగిన నిశ్చితార్ధం పెళ్లి దాకా వెళ్లలేకపోవడం, రెండో కుమార్తె శ్రీజ చేసుకున్న ప్రేమపెళ్లిని పెద్ద మనసుతో వెంటనే అంగీకరించక పోవడం, తమ్ముడు పవన్‌కల్యాణ్ రెండో పెళ్లి కేసులో చిక్కుకోవడం వంటివి ఆయనకు ఇబ్బంది కలిగించవచ్చు.
* థమ్సప్ వ్యాపార ప్రకటనల్లో నటించడమే కాక, ఆ శీతల పానీయాల్లో ఎలాంటి హానికారకాలు లేవని ప్రకటించడం విమర్శలకు తావిచ్చింది. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక ఆ వివాదం మళ్లీ తెర మీదకు రావచ్చు.
* ఎన్టీఆర్ తెలుగువాళ్ల ఆత్మగౌరవ నినాదంతో రాజకీయల్లోకి వచ్చి విజయం సాధించారు. చిరంజీవికి అవినీతి రహిత పాలన తప్ప మరో స్లోగన్ దొరక్కపోవచ్చు. పైగా అప్పుడు ఎన్టీఆర్ ఎదుర్కొన్నది ఒక్క కాంగ్రెస్‌నే. ఇప్పుడు కాంగ్రెస్, టిడిపి.. రెండింటినీ చిరంజీవి ఎదుర్కోవాలి.
* అప్పట్లో ఎన్టీఆర్‌కున్న కరిష్మాతో చిరంజీవి కరిష్మాని పోల్చలేం. పౌరాణిక పాత్రలతో ఎన్టీఆర్ చాలామందికి దేవుడు. అలాంటి పాత్రలేవీ చిరంజీవి చేయలేదు. అభిమానుల్లో తప్ప సామాన్య ప్రజానీకంలో చిరంజీవికి అంతటి ఆదరణ వుండకపోవచ్చు.
* ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ వరదలా పారతాయి. చిరంజీవి వాటి పంపకాన్ని జరపకుండానే ఎన్నికల్లో పోటీ చేస్తారా? వాటి పంపకాలు జరిపితే ఆయన మీదున్న క్లీన్ ఇమేజ్ ఒక్క దెబ్బతో తుడిచి పెట్టుకుపోతుంది.
* సొంత ఇంటి వ్యవహారాల్నే చక్కదిద్దుకోలేక ఇబ్బంది పడ్డవాడు ప్రజల కష్టాల్ని ఎలా తీరుస్తాడనే ఇతర పార్టీల విమర్శల్ని ఆయన ఎదుర్కోవాల్సి రావచ్చు.
* సినీ గ్లామర్ చిరంజీవికే పరిమితం కాదు. బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి జనంలో విశేషాదరణ వున్న తారలు టిడిపికి దన్నుగా వున్నారు. కాంగ్రెస్ కూడా చివరి నిమిషంలో పేరున్న తారల్ని రంగంలోకి దించే అవకాశాలు లేకపోలేదు.  
* ఆయన పార్టీలో చేరాలని ఉత్సాహం చూపుతున్న రాజకీయ నాయకులకు కొదవ లేదు. అయితే అవినీతి రహితంగా పార్టీని తయారు చేస్తామని చెబుతున్న ఆయనకు అలాంటి నాయకులు దొరకడం బహు కష్టం.
Give your Rating Here :
Average Rating: 4.25    Votes: 8
 
Featured Recommended
 
 
Movies Actress Actor Events