
డైరీలో ఆఖరి పేజీ వచ్చేసింది. ఒక్క అడుగుదూరంలో కొత్త సంవత్సరం స్వాగతిస్తోంది. ఇంతవరకూ 2007లో సాగిన చిత్రరంగ ప్రయాణాన్ని ఒకసారి అవలోకించుకుంటూ ముందడుగు వేయాల్సిన మలుపులో ఉన్నాం మనం. ముందుగా కీలకమైన అంశాలను, ప్రభావితం చేసిన అంశాలను చూస్తే...విభిన్నతతో కూడిన చిత్రాలకు ఎప్పుడూ తమ ఆదరణ ఉంటుందని ఈ సంవత్సరం అనేక విభిన్న చిత్రాలకు విజయాన్ని కట్టబెట్టడం ద్వారా నిరూపించారు తెలుగు ప్రేక్షకులు. కధలో నవ్యత, కధనంలో నూతనత్వమ్ తప్ప స్టార్‌డం తో తమకు పనిలేదని బాక్సాఫీస్ సాక్షిగా పలు భారీ చిత్రాలకు నిరాశాజనకమైన ఫలితాలను అందించారు. కార్పొరేట్ కంపెనీల ఆగమనం, రెక్కలొచ్చిన శాటిలైట్ హక్కుల ధరలు..వంటి అంశాలు చిత్ర పరిశ్రమపై ప్రభావం చూపిస్తూ క్వాలిటీ సినిమాలు రావడానికి ఒక వంక తోడ్పడుతుంటే, అనుభవం లేని దర్శక నిర్మాతలు మరో వంక నష్టపొతూనే ఉన్నారు. ఏది ఏమైనా, ఎప్పట్లానే స్వల్ప విజయాలను అందిపుచ్చుకుని, భారీ పరాజయ పరాభవ భారాన్ని మూట గట్టుకుని నిష్క్రమిస్తోంది 2007. ఇక ఈ సంవత్సరం నమోదైన కీలక పరిణామాలను కూలంకషంగా పరిశీలిద్దాం!
మంచి చిత్రాలకు మధుమాసం...
ప్రతీ సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా తెలుగులో నమోదైన విజయాల శాతం 15కి దాటి మించలేకపోయింది. అయితే, వీటిలో మంచి చిత్రాలు, విభిన్న చిత్రాలు విజయం సాధించడం చెప్పుకోదగ్గ పరిణామంగా చెప్పుకోవాలి. 2007లో నేరుగా తెలుగులో రూపొందిన చిత్రాలు మొత్తం 102 విడుదలయ్యాయి. జనవరిలో ఆల్లు అర్జున్, పూరీజగన్నాధ్ ల చిత్రం దేశ ముదురు చిత్రం సూపర్ హిట్ కాగా, ప్రభాస్, వి.వి.వినాయక్‌ల యోగి ఎవరేజ్ అనిపించుకుంది. ఫిబ్రవరిలో విడుదలైన వాటిలో ఎవడైతే నాకేంటి, మధుమాసం, ఆదివారం ఆడవాళ్ళకు సెలవు సినిమాలు నిర్మాతలకు సేఫ్ ప్రాజెక్టులుగా మిగిలాయి. మార్చిలో మొత్తం ఏడు చిత్రాలు విడుదల కాగా ఒక్కటి కూడా విజయాన్ని చవిచూడకపోవడం విచారకరం. ఏప్రిల్‌లో అత్తిలి సత్తిబాబు, ఢీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రాలు విజయాన్ని నమోదు చేసుకున్నాయి. మే నెల్లో 13 చిత్రాలు విడుదల అయితే, వాటిలో ఒక్కఆపరేషన్ దుర్యొధన మినహా మిగిలినవన్నీ పరాజయాన్నే మూట గట్టుకోవలసి వచ్చింది. జూన్‌లో 10 సినిమాలు విడుదల అయ్యాయి. వీటిలో దుబాయి శీను ఒక్కటే ఫరవాలేదనిపించుకోగా, మిగిలిన సినిమాలు నిర్మాతలకు ఆర్ధికంగా నష్టాన్నే కలగజేశాయి. జూలైలో ఆరు చిత్రాలు విడుదలై, లక్ష్యం సినిమా ఒకటే రెవిన్యూ రాబట్టుకోగలిగింది. ఆగస్టులో నాలుగు చిత్రాలు విడుదల కాగా, యమదొంగ చిత్రం రెవిన్యూ పరంగా కొత్త రికార్డులు నెలకొల్పగా, యమగోల మళ్ళీ మొదలైంది ఫరవాలేదనిపించుకుంది. సెప్టెంబర్‌లో ఏడు సినిమాలు విడుదలై వాటిలో చందమామ ఒక్కటే విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది సంచలనాత్మక చిత్రంగా చెప్పుకోవలసిన రామ్ చరన్ తేజ్ చిత్రం చిరుత అతనికి మంచి మార్కులు ఇవ్వగలిగింది తప్పితే, సినిమా పరంగా మార్కులు సంపాదించలేకపోయింది. అక్టోబర్ నెల్లో హాపీ డేస్ చిత్రం ఈ ఏడాదికే సూపర్ హిట్‌గా నిలిస్తే, తులసి చిత్రం కమర్షియల్ హిట్ సాధించింది. నవంబర్ నెల్లో తొమ్మిది చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో నవ వసంతం ఫరవాలేదనిపించుకుంది. డిసెంబర్ నెల కొత్తదానానికి స్వాగతమిస్తూ మంత్ర, అనసూయ వంటి చిత్రాల విజయంతో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. డిసెంబర్ ఆఖరివారంలో విడుదలైన మీ శ్రేయోభిలాషి చిత్రం టాక్ బాగుంది. రెవిన్యూ పరంగా ఏ మాత్రం నిలబడుతుంది అనేది వేచి చూడాలి. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఇక్కడ పేర్కొన్నది విజయవంతమైన చిత్రాలను మాత్రమే. వీటిని పరిశీలిస్తే ఒకదానికి, ఒకదానికి ఏ మాత్రం పొంతన లేకపోవడం విశేషం. అంటే ఫార్ములకి దూరంగా, కొత్తదనం ఉన్న చిత్రాలకే ప్రేక్షకులు విజయాన్ని కట్టబెట్టారన్నది స్పష్టంగా కనిపిస్తుంది.
పే చెయ్యని స్టార్‌డం
ఆగ్రా కధానాయకులు నటించిన భారీ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడడం ఏ ఏడాది చెప్పుకోదగ్గ పరిణామం. చంద్రముఖి వంటి సంచలన విజయం తరువాత పి.వాసు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన మహారధి చిత్రం విడుదలకు ముందు ఎన్ని అంచనాలనునిర్మించినప్పటికీ, విడుదలయ్యాక చతికిలబడిపోయింది. అభిమానులను, సినీ వర్గాలను బాగా డిజాప్పాయింట్ చేసిన చిత్రంగా ఫిబ్రవరి నెల్లో విడుదలైన మహారధి చిత్రం నిలబడిపోయింది. అలాగే, మెగాస్టార్ చిరంజీవి హీరోగా,శంకర్‌దాదా ఎంబిబిఎస్‌కు సీక్వెల్‌గా రూపొందిన శంకర్‌దాదా జిందాబాద్ చిత్రం కూడా నిరాశాజనకమైన ఫలితాన్నే అందించింది. ఈ చిత్రం రీ మేక్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసి రూపొందించిన ఈ చిత్రం నిర్మాతలకు, బయ్యర్లకు ఆర్ధిక నష్టాన్నే కలగజేసింది. అలాగే, మహేష్ బాబు నటించిన అతిధి చిత్రం మేకింగ్ పరంగా కొన్ని కొత్త ప్రమాణాలను నెలకొల్పినప్పటికీ, ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. మరో ఆగ్రా హీరో అక్కినేని నాగార్జున లారెన్స్ దర్శకత్వంలో చేసిన డాన్ చిత్రం వివాదాస్పద పరిస్థితుల నడుమ విడుదలై బ్యాడ్ టాక్ తో ఎదురీదుతున్నాడు.ఇదీ అగ్ర హీరోలు నటించగా ఈ సంవత్సరం విడుదలైన చిత్రాల ఫలితాలు. స్టార్‌డం కన్నా ఆసక్తికరమైన కధా కధనాలే ప్రేక్షకులని థియేటర్లకు రప్పించే కీలకాంశాలని ఈ చిత్రాలు మరోమారు రుజువు చేశాయి.
అంచనాల అందలాలు అందుకొని చిత్రాలు
విడుదలకు ముందు కాంబినేషన్ పరంగా కానీ, ప్రీవీయస్ ట్రాక్ రికార్డు రీత్యా కానీ అనేక అంచనాలను నెలకొల్పి విడుదలయ్యాక వాటిని అందుకోలేని చిత్రాలు ఏమిటో గమనిద్దాం! భారీ అంచనలతో, భారీ బడ్జెట్తో తేజ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా సేనియర్ నిర్మాత మహేంద్ర నిర్మించిన లక్ష్మీ కళ్యాణం
చిత్రం అందరినీ నిరాశకు గురి చేసింది. కాంబినేషన్ పరంగా క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ, ప్రేక్షకాదరణ పొందడంలో ఘోరంగా విఫలమైందీ చిత్రం. అలాగే, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన ఒక్కడున్నాడు చిత్రం కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తినే రేకెత్తించింది. అయితే, మేకింగ్
పరంగా కూడా మంచి చిత్రమే అయినప్పటికీ ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ఆర్య ఫేమ్ సుకుమార్, దేవదాస్ ఫేమ్ రామ్ కాంబినేషన్ అనగానే సర్వత్రా భారీ అంచనలు చోటు చేసుకున్నాయి. కానీ విడుదలయ్యాక జగడం చిత్రం భారీ పరాజయ భారం మొయ్యక తప్పలేదు. దిల్ రాజ్ నిర్మించిన ప్రభాస్ చిత్రం మున్నా, ఎమ్మెస్ రాజు సిద్ధార్ధ , ఇలియాన జంటగా నిర్మించిన ఆట చిత్రాలు కూడా క్రేజీ ప్రాజెక్టులే అయ్యాయి కానీ థియేటర్లలో ప్రేక్షకులను సంతృప్తి పరచలేకపోయాయి. చిరకాలంగా అభిమానులను ఊరిస్తూ అనేక అంచనాలను సృస్టించిన రామ్ చరణ్ తేజ్, పూరీ జగన్నాధ్ ల చిత్రం చిరుత హీరో తెరంగేట్రానికి మంచి వేదిక కాగలిగింది కానీ, విజయం సాధించడంలో మాత్రం ఆ స్థాయికి రాలేకపోయింది. అలాగే, వియ్యాల వారి కయ్యాలు కూడా అదే బాట పట్టింది.
కొత్తదనం ఉన్న చిత్రాలకు హాపీ డేస్
ఆర్టిస్టులు ఎవరైనా ఫరవాలేదు, కొత్తదనం ఉంటే చాలు మేము ఆదరిస్తాం అని హాపీ డేస్ సాక్షిగా ఈ ఏడాది తమ అభిరుచిని చాటి చెప్పారు తెలుగు ప్రేక్షకులు. ఈ ఏడాదికే సూపర్ హిట్ గా నిలిచిన శేఖర్ కమ్ముల చిత్రం హాపీ డేస్ మనసుని హత్తుకునే కధాంశంతో, ప్రేక్షకుల మనసుల్లో కూడా చిన్ని చిన్ని జ్ఞాపకాలని నిద్ర లేపుతూ సాగుతుంది. కొత్త తారలతో రూపొందిన ఈ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించడం చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా కుదుపు ని తెచ్చిందనే చెప్పాలి. ఇక ఈ తరహా చిత్రాలు రూపొందించడానికి పలువురు ప్రణాళికలు రచిస్తున్నారంటే హాపీ డేస్ చిత్రం సాధించిన ఘనత ఏమిటో ఇట్టే అర్ధమవుతుంది. కొత్త వాళ్ళు అనే కాదు, కొత్తదనం సినిమా ఆద్యంతం కనిపించడమే హాపీడేస్ చిత్రం విజయ రహస్యం. ఫార్ములాకు దూరంగా ప్రేక్షకులని ప్రలోభ పెట్టె అవలక్షణాలు లేకుండా
గుడ్ ఫీల్తో ఈ చిత్రం సాధించిన సక్సెస్ మంచి చిత్రానికి లభించిన మంచి విజయం. ఎందరికో స్పూర్తి దయకమైన విజయం!
విభిన్నతే విజయ మంత్రం!
ఈ సినిమా దర్శకుడు ఎవరో తెలీదు, నిర్మాత ఎవరో తెలీదు, ఒక్క చార్మీ తప్పితే సినిమాలో ఇంకెవరు ఉన్నారో తెలీదు, అయినా సినిమా హిట్. సినిమాలోని విభిన్నతే విడుదలైన తొలి రోజు నుంచి మంత్ర చిత్రాన్ని విజయపధంలో నడిపిస్తోంది. లో ప్రొఫైల్ లో రూపొంది విడుదలై ఇవాళ ప్రేక్షకుల ఫస్ట్ చాయీస్గా ఉన్న చిత్రం మంత్ర. రెగ్యులర్ అంశాలకు దూరంగా, కధనంలోని కొత్తదనం, విభిన్నతతో మంత్ర చిత్రాన్ని విజయ తీరాల దిశగా నడిపించిన ఈ చిత్ర దర్శకుడు తులసీరాం సత్ఫలితాన్ని ఇచ్చిన ప్రయత్నంతో తనదైన పేరు సంపాదించుకున్నడనే చెప్పాలి. అలాగే, రవిబాబు దర్శకత్వంలో భూమిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అనసూయ కూడా విభిన్న మార్గంలో రూపొంది ప్రేక్షకుల మన్నన చూరగొంది. ఈ రెండు చిత్రాలు కేవలం ఉదాహరణ మాత్రమే! విభిన్న కధంశంతో ఆకట్టుకునే కధనంతో తమను అలరించే విధంగా చిత్రాలు రూపొందిస్తే తమ ఆదరణ పంచడానికి తాము సదా సిద్ధంగా ఉంటామని ప్రేక్షకులు నచ్చి ఇచ్చిన ఆమోద ముద్ర ఈ చిత్రాల విజయం.
చిరంజీవితంలో చేదు పుట
మెగాస్టార్ చిరంజీవి జీవితంలో ఇటు వృత్తిపరంగా కానీ,అటు వ్యక్తిగతంగా కానీ 2996 ఎటువంటి సత్కారాలు, సన్మానాలు, గౌరవ పురస్కారాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోయిందో 2007 అందుకు విభిన్నంగా చేదు అనుభవాలను ఆయన డైరీలోపొందుపరిచింది. గత సంవత్సరం భారత ప్రభుత్వం చేత పద్మభూషణ్, ఆంధ్ర యూనివర్సిటీ చేత గౌరవ డాక్టరేట్ అందుకుని, యావత్ తెలుగు చిత్రపరిశ్రమ చేత సన్మానం అందుకున్నారు చిరంజీవి. ఆయనకే కాకుండా ఆయన అభిమానులకు కూడా 2006 ఒక మరుపురాని సంవత్సరం. 2007 విషయానికి వస్తే శంకర్దాదా జిందాబాద్ చిత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. వ్యక్తిగతంగా తీసుకుంటే చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ చెప్ప పెట్టకుండా ప్రేమ వివాహం చేసుకోవడమే కాకుండా, చిరంజీవి కుటుంబసభ్యుల నుంచే తమకు ప్రాణ హాని ఉందని సుప్రీం కోర్టు వరకూ వెళ్ళడం ఒక షాక్. ఆయన స్థాయి వ్యక్తి ఇమేజ్ని దెబ్బతీసే సంఘటన. ఇక చిరంజీవి తండ్రి కె. వెంకట్రావు ఈ ఏడాది చివరిలో అకస్మాత్తుగా కన్ను మూయడం కూడా చిరంజీవి కుటుంబ సభ్యులకు వెలితి తీరని విషాద సంఘటన. కొడుకు చరణ్ తేజ్ అభిమానుల ఆదరణ సంపాదించుకోవడం ఒక్కటే ఈ ఏడాది చిరంజీవికి చెప్పుకోదగిన ఊరట.
| Give your Rating Here : |
Average Rating: 3.70
Votes: 10
|


























