Tollywood 2007: Newsmakers
January 3rd, 2008

ప్రతియేటా మాదిరిగానే తెలుగు చిత్ర సీమలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. కొంతమంది వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. జరిగిన సంఘటనల్లో కొన్ని మోదాన్ని కలిగిస్తే, కొన్ని ఖేదాన్ని కలిగించాయి.
చిరంజీవికి చేదు అనుభవాలు:
చిత్రసీమలో రెండు పెద్ద కుటుంబాలు ఈసారి వార్తల్లో నిలవడం గమనార్హం. ఒక్క చిరంజీవి కుటుంబమే పలుమార్లు హెడ్‌లైన్స్‌లో నిలిచింది. మొదట పవన్ కల్యాణ్ బహు భార్యత్వం కేసులో వార్తల్లో నిలవగా, ఆ తర్వాత చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తల్లిదండ్రుల అభీష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకుని ఏకంగా జాతీయ మీడియా దృష్టినే ఆకర్షించింది. రెండు మూడు వారాల పాటు ఆమె ఉదంతం వార్తల్లో నిలిచింది. అదే సమయంలో తన లైసెన్సుడ్ రివాల్వర్‌ను పోలీసులకు సరెండర్ చేసిన పవన్ కల్యాణ్ 'కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్' అనే సామాజిక సంస్థను నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు. అది పాతబడే సమయంలో చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించ బోతున్నారనే అంశం విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. కొన్ని వర్గాలు ఆయనను బడుగు వర్గాల ప్రతినిథిగా చిత్రీకరించేందుకు కష్టపడ్డాయి. కానీ ఈ విషయంలో చిరంజీవి మాత్రం తాను ఏ సంగతీ స్పష్టం చేసేదాకా సంయమనం పాటించాల్సిందిగా తన అభిమానుల్ని కోరారు. అయితే ఆయన 2008లో రాజకీయ పార్టీని ప్రకటిస్తారనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ రాజకీయ రంగ ప్రవేశ ప్రహసనం కొనసాగుతుండగానే యేడాది చివరలో చిరంజీవి తండ్రి వెంకట్రావు అనారోగ్యంతో మృతిచెందారు. ఈ రకంగా చిరంజీవికి 2007 అన్ని రకాలుగా చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది.
బాలయ్య ఇంట్లో పెళ్లి:
ఇదే యేడాది మరో పెద్ద కుటుంబమైన నందమూరి బాలకృష్ణ ఇంట్లో పెళ్లి బాజాలు సంప్రదాయబద్ధంగా మోగాయి. ఆయన పెద్ద కుమార్తె బ్రహ్మణికీ, ఆయన బావ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్‌కీ ఘనంగా వివాహం జరిగింది.
పరస్పర విమర్శలు:
తెలుగు సినిమా టాకీ యుగం మొదలై 75 యేళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని జరిగిన వేడుకల్లో మోహన్‌బాబు, చిరంజీవి మధ్య చోటుచేసుకున్న అనారోగ్యకర వాతావరణం, ఒకరిపై మరొకరు పరోక్షంగా చేసుకున్న ఆరోపణలు మీడియాలో పతాక శీర్షికలకెక్కాయి. ఈ సందర్భంలోనే ఈ వేడుకల కన్వీనర్, సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు మీడియా పట్ల అనుచితంగా ప్రవర్తించి వార్తల్లోకెక్కారు.
రూపం మారిన ఎన్టీఆర్:
తెలుగు హీరోల్లో ఈసారి అందరి దృష్టినీ ఎక్కువగా ఆకర్షించిన హీరో ఎన్టీఆర్. 'రాఖీ'లో బోండాంగా కనిపించిన అతను 'యమదొంగ'లో బక్కపలచగా దర్శనమిచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. జుట్టుపెంచి ఓ పాటలో పోనీటైల్‌తో కనిపించాడు. రూపపరంగా పూర్తిగా మారి కనిపించినప్పటికీ 'యమదొంగ'గా అతన్ని ప్రేక్షకులు ఆశీర్వదించి, ఆ సినిమాకి ఘనవిజయం చేకూర్చిపెట్టారు.
'హ్యాపీడేస్' తెచ్చిన దర్శకుడు:
తెలుగు సినిమాకి ఈ యేడాది 'హ్యాపీడేస్' తెచ్చిన దర్శకుడిగా శేఖర్ కమ్ముల అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నారు. దాదాపు అంతా కొత్తవాళ్లతో, తక్కువ బడ్జెట్‌తో ఆయన  తీసిన ఆ సినిమా భారీ, క్రేజీ చిత్రాలను వెనక్కినెట్టి కలెక్షన్ల తుఫానుని సృష్టించడమే గాక, విమర్శకుల్ని సైతం అమితంగా ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ కంటే ముందుగా అమెరికాలో ఆ సినిమాని రిలీజ్ చేసి ఆశ్చర్య పరిచిన ఆయన దానికంటే ముందుగా ఆ సినిమాని మీడియాకు ధైర్యంగా చూపించి, తన సినిమా మీద తనకున్న అపార నమ్మకాన్ని చాటుకున్నారు. 'హ్యాపీడేస్' బాటలో ఇప్పుడు కొన్ని సినిమాలు తయారవుతుండడంతో శేఖర్ ట్రెండ్‌సెట్టర్ కూడా అయ్యారు.
వారసులొచ్చారు:
ఇద్దరు పేరుపొందిన వ్యక్తుల వారసులు పరిచయమై మంచి భవిష్యత్తు ఉందనే నమ్మకాన్ని కలిగించారు. వారిలో ఒకరు చిరంజీవి కుమారుడు రాంచరణ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అతను నటించిన 'చిరుత' విడుదలకు ముందు అన్ని రంగాల వారి దృష్టినీ ఆకర్షించింది. చిరంజీవి కుమారుడు ఎలా ఉంటాడు, ఎలా నటించాడనే సంగతి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపించారు. అందుకు అనుగుణంగానే డాన్సుల్లో, ఫైట్ సీన్లలో ఈజ్ చూపించి, యాంగ్రీ యంగ్‌మన్ పాత్రలకి పనికి వస్తానని అతను రుజువు చేసుకున్నాడు. ఆ తర్వాత సీనియర్ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి కుమారుడు వైభవ్ సైతం 'గొడవ'తో ప్రేక్షకుల ముందుకొచ్చి, అభినయపరంగా మంచి మార్కులు పొందాడు.
మళ్లీ వచ్చిన తార:
తెలుగు చిత్ర సీమలో 'పర్ఫెక్ట్ ఫిగర్'గా పేరుపొంది, పెళ్లి తర్వాత కొంత కాలం సినిమాలకు దూరమైన నటి సిమ్రాన్ మళ్లీ తెలుగు సినిమాల్లోకి వచ్చింది. బాలకృష్ణ సరసన 'ఒక్క మగాడు', కమెడియన్ కృష్ణభగవాన్‌తో 'జాన్ అప్పారావ్ 40+' సినిమాలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ సినిమాలు రెండూ 2008 మొదట్లో విడుదలవుతున్నాయి. ఆమె కంబ్యాక్ ఎలా ఉంటుందో చూడాలని సినీ వర్గాలు వేచి చూస్తున్నాయి.
ఛార్మి మంత్రం:
యేడాది చివరలో మెరుపులా మెరిసి వార్తల్లో నిలిచిన తార నిస్సందేహంగా ఛార్మి. ఆమె నటించిన థ్రిల్లర్ 'మంత్ర' ప్రేక్షకాదరణ పొందడమే గాక, అందులో ఆమె నటన, ఆమె డ్యాన్సులు యువతని బాగా అలరిస్తున్నాయి. ఇటీవల అంతగా అవకాశాలు పొందలేకపోతున్నా ఆమె కెరీర్‌కు ఆక్సిజన్ అయ్యింది 'మంత్ర'.
..యజ్ఞమూర్తి

Give your Rating Here :
Average Rating: 4.25    Votes: 14
 
Featured Most Popular
 
 
Movies Actress Actor Events