Aryan Rajesh, Shraddha Arya combo film launched
చాలాకాలం తర్వాత ఆర్యన్ రాజేష్ హీరోగా ఒక సినిమా మొదలైంది. లివింగ్ లెజెండ్స్ క్రియేషన్స్ బానర్‌పై ఎల్ ఈశ్వర్ నిర్మించే ఈ సినిమా ద్వారా రామకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'గొడవ' ఫేమ్ శ్రద్ధా ఆర్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం నానక్‌రామగూడలోని రామానాయుడు సినీవిలేజ్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సీనియర్ నిర్మాత సి కల్యాణ్ క్లాప్‌నివ్వగా, శాంతి శ్రీహరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి నటుడు శ్రీహరి గౌరవ దర్శకత్వం వహించారు. సినిమాలో శ్రీహరి ఒక కీలక పాత్రను చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నాకు ప్రత్యేకమైన గుర్తింపునిస్తున్న పాత్రలు చేస్తూ థ్రిల్ ఫీలవుతున్నా. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'ఢీ' వంటి సినిమాలు అలాంటి తృప్తినిచ్చాయి. ఈ సినిమా సబ్జెక్ట్ వినగానే ఇది రాజేష్‌కు సరైన బ్రేక్‌నిస్తుందనే నమ్మకం కలిగింది. అలాగే నా పాత్ర ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది" అని చెప్పారు.
"నా కెరీర్‌లో పెద్ద గ్యాప్ వచ్చిందని నాకు తెలుసు. ఒకటిన్నర సంవత్సరం నుంచి సరైన స్క్రిప్ట్ కోసం చూస్తున్నా. రామకృష్ణ చాలా చక్కని స్క్రిప్ట్‌తో నావద్దకు వచ్చారు. కథ సింపుల్‌గా వున్నా కథనం గొప్పగా వుంటుంది. ఒక మిస్స్‌డ్ కాల్‌తో మొదలయ్యే సినిమా క్రమంగా థ్రిల్‌ని కలిగిస్తూ క్లైమాక్స్ వైపు సాగిపోతుంది. శ్రీహరి గారికీ, నాకూ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. సినిమాలో చక్కని వినోదముంటుంది" అని ఆర్యన్ రాజేష్ చెప్పాడు.
దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ "ఇది చిన్న కథ. మైండ్ గేమ్ మీద ఆధారపడి నడిచే కథ. దీన్ని లవ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ట్రెండ్స్‌కి భిన్నమైన ట్రెండులో ఉంటుంది ఈ సినిమా. రాజేష్‌కు ఈ సినిమా పేరు తెస్తుందనే నమ్మకముంది. మా సినిమాలో నటించేందుకు అంగీకరించిన శ్రీహరికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మా సినిమాకు ఆయన ఒక ఎస్సెట్" అని తెలిపారు.
నిర్మాత ఈశ్వర్ మాట్లాడుతూ "నేటి నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి నెలాఖరు దాకా తొలి షెడ్యూల్ జరుపుతాం. జూన్, జూలై, ఆగస్టులలో జరిపే షెడ్యూల్స్‌తో షూటింగ్ పూర్తవుతుంది. కొన్ని పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. దసరాకి సినిమాను విడుదల చేయాలనేది మా సంకల్పం" అని చెప్పారు. డైమండ్ రత్నబాబు మాటలు రాస్తున్న ఈ సినిమాకు అగస్త్య సంగీత దర్శకుడు.
 
Featured Recommended
 
 
Movies Actress Actor Events