
Mahesh disappoints Jasti
June 27th, 2008
మహేష్ సినిమాతో దర్శకుడిగా పరిచయమవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న జాస్తి హేమాంబర్ పరిస్థితి అయోమయంగా తయారయ్యింది. మహేష్ నటించిన కొన్ని సినిమాలకు కో డైరెక్టర్‌గా వ్యవహరించిన జాస్తికి మహేష్‌తో సన్నిహితత్వం కూడా ఏర్పడింది. అతను చెప్పిన కథ నచ్చడంతో అతని దర్శకత్వంలో నటించేందుకు మహేష్ పచ్చ జెండా ఊపాడు. అలా 'మిర్చి' ప్రాజెక్టు రంగం మీదికి వచ్చింది. 'అతిథి' తర్వాత మహేష్ చేయాల్సిన సినిమా ఇదే. 2007 డిసెంబరులో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి రంగం సిద్దమయ్యింది. దీంతో మహేష్ వంటి సూపర్‌స్టార్‌తో తన కెరీర్ ప్రారంభం కాబోతున్నందుకు జాస్తి ఎంతగానో సంతోషపడ్డాడు. రొమాంటిక్ కామెడీగా దాన్ని తీర్చిదిద్దేందుకు స్క్రిప్టును పకడ్బందీగా తయారు చేసుకున్నాడు. దుర్గా ఆర్ట్స్ బానర్‌పై కెఎల్ నారాయణ, ఎస్ గోపాల్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించాలని సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ను, ఆర్ట్ డైరెక్టర్‌గా అశోక్‌ను ఎంచుకున్నారు. హైదరాబాద్ శివార్లలో ఒక భారీ సెట్‌ను నిర్మించడానికి అశోక్ పనులు కూడా మొదలుపెట్టాడు. అంతలోనే 'మిర్చి'ని ఇప్పడు చేయనని నిర్మాతలకు కబురు పెట్టాడు మహేష్. దాంతో నిర్మాతలు ఖంగు తిన్నారు. పారితోషికం విషయంలో అసంతృప్తి చెందడం వల్లే మహేష్ దాన్ని వాయిదా వేశాడని అంతర్గత వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'వరుడు' చేయడానికి మహేష్ సిద్ధమయ్యాడు. దాని తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రంజీకాంత్ కుమార్తె సౌందర్య నిర్మించే సినిమా చేయడానికి ఇప్పటికే అంగీకరించాడు. అంటే 2009లో కూడా 'మిర్చి' సెట్స్ మీదకు వెళ్లడం సందేహాస్పదమైంది. దీంతో మహేష్ మీద ఎంతగానో నమ్మకం పెట్టుకుని ఇప్పటికే మూడేళ్లుగా అతని కోసం ఎదురుచూస్తున్న జాస్తి హేమాంబర్ ఎంతో బాధ పడుతున్నాడనీ, 'మిర్చి'ని మరో హీరోతో చేయడానికి గల అవకాశాల్ని పరిశీలిస్తున్నాడనీ తెలియవచ్చింది.
| Give your Rating Here : |
Average Rating: 2.67
Votes: 6
|
News | Box Office | Previews | Reviews | Trailers | Galleries | Wallpapers | Events | Videos | Audio Songs
©2006 - 2008 Chitramala.com. All rights reserved.



























