Chiru party’s idealogue is Dr. Mitra
Wednesday, June 4th, 2008 at 10:48 pm

డాక్టర్ మిత్రా.. ఇప్పుడు తరచూ మీడియాలో వినిపిస్తున్న పేరు ఇది. చిరంజీవి పార్టీని పెట్టడం ఖాయమని కొంతకాలంగా మీడియాకూ, రాజకీయ నాయకులకూ చెబుతూ వస్తున్న వ్యక్తి. సిపిఎం కార్యదర్శి బివి రాఘవులునూ, సిపిఐ కార్యదర్శి నారాయణనూ కలిసి, చిరంజీవి పెట్టబోయే పార్టీతో పొత్తు గురించి ఆయన మాట్లాడిన సంగతి మీడియాలో ప్రముఖంగా వచ్చిన సంగతి తెలిసిందే. చిత్రమాలకు తెలిసిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం చిరంజీవి పెట్టబోతున్న ’లేబర్ పార్టీ’కి ఆయనే సిద్ధాంత కర్త. పార్టీ మేనిఫెస్టో తయారు చేయడంలో, ఎజెండాని రూపొందించడంలో ఆయనదే కీలక పాత్ర. కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్‌కు ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతకర్త అని మనకు తెలుసు. ఇప్పుడు చిరంజీవి లేబర్ పార్టీకి డాక్టర్ మిత్రా అటువంటి పాత్రనే పోషిస్తున్నారు. విఖ్యాత కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య తమ్ముడు రామచంద్రారెడ్డి కుమారుడే ఈ మిత్రా. పెదనాన్న మాదిరిగానే కమ్యూనిజం పట్ల ఆకర్షితులైన మిత్రా తన పేరులోంచి రెడ్డిని తొలగించుకున్నారు. చిరంజీవికి శ్రేయోభిలాషిగా, సన్నిహితుడిగా మారిన ఆయన ఇప్పుడు ఆయన తీసుకొస్తున్న పార్టీకి ఏకంగా సిద్ధాంతకర్తే అయ్యారు.



























