Dasavatharam
|
కమలహాసన్ పది పాత్రలు పోషించిన 'దశావతారం' జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. రజనీకాంత్ 'శివాజి' తర్వాత దక్షిణాది నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా సినిమా ప్రియుల కళ్లన్నీ దానిమీదే వున్నాయి. ఆస్కార్ ఫిలిమ్స్ అధినేత వి. రవిచంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. రవికుమార్ దర్శకుడు. కమలహాసన్, రవికుమార్ కాంబినేషన్‌లో ఇది నాలుగో సినిమా. కమల్ సరసన నాయికగా అసిన్ ద్విపాత్రలు పోషించగా, బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్, నిన్నటి తరం అందాల తార జయప్రద కూడా కమల్ సరసన కనిపించనున్నారు.
'దశావతారం' చిత్ర కథ 12వ శతాబ్దంలో మొదలై, నేటి కాలంలో నడుస్తుంది. 12వ శతాబ్దంలో రాజు రెండవ కుళోత్తుంగ చోళుని అరాచకాలకు అంతు వుండదు. విష్ణు భక్తుడైన రంగరాజ నంబి ఆ రాజుకు ఎదురు తిరుగుతాడు. దాంతో రాజద్రోహం కింద నంబికి మరణ దండన విధిస్తాడు చోళుడు. తనను ఉరి తీసే సమయంలోనూ నంబి విష్ణు విగ్రహాన్ని వదలడు. ఆ విగ్రహంతో పాటు నంబి మృతదేహాన్ని సముద్రంలో పారేయిస్తాడు చోళుడు. ఆ తర్వాత కథ నేటి కాలంలోకి మారుతుంది. ఈ ఆధునిక కాలంలో కమలహాసన్ 9 పాత్రల్లో కనిపిస్తాడు. ఆ పాత్రలన్నింటికీ కథతో సంబంధం వుంటుంది. రంగరాజ నంబి పాత్రతో పాటు గోవింద రామస్వామి, జార్జి బుష్, అవతార్ సింగ్, క్రిస్టియన్ ఫ్లెచర్, షింఘేన్ నరహసి, కృష్ణవేణి, విన్సెంట్ పూవరాగన్, కలీఫుల్లా ఖాన్, బలరాంనాయుడు పాత్రల్ని కమల్ పోషించాడు. రెండవ కుళోత్తుంగ చోళునిగా నెపోలియన్ నటించగా, ఇతర పాత్రల్ని నగేష్, పి. వాసు, సంతాన భారతి, రేఖ, రఘురాం, కె.ఆర్. విజయ చేశారు.
2005 మధ్యలో 'దశావతారం' ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. షూటింగ్ 2006 ఆగస్టులో మహాబలిపురంలో ప్రారంభమైంది. చెన్నైలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెరికా, జపాన్, మలేషియా, థాయిలాండ్‌లలో చిత్రీకరణ జరిపారు. క్లైమాక్స్‌లో సునామీ సన్నివేశాలను ఒళ్లు గగుర్పాటు గొలిపే రీతిలో తీశారు. వాటిని మహాబలిపురంలో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరించారు. 
ప్రాజెక్టు ప్రకటించినప్పట్నించీ వార్తల్లో నిలుస్తున్న ఈ సినిమాను వివాదాలూ చుట్టుముట్టాయి. తన కథను తనకు తెలీకుండా దొంగిలించి 'దశావతారం' తీస్తున్నారంటూ 2006 సెప్టెంబరులో సెంథిల్‌కుమార్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ కమలహాసన్, నిర్మాత రవిచంద్రన్‌లకు వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. సరిగ్గా యేడాది తర్వాత ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇక ఈ సినిమాలో శైవులు, వైష్ణవుల మధ్య కలహాల్ని రేకెత్తించే సన్నివేశాలు వున్నాయంటూ విశ్వ హిందూ పరిషత్ ఆరోపించింది. ఆ తర్వాత 'దశావతారం'లో అలాంటి సన్నివేశాలేవీ లేవనే సంగతి సెన్సార్ సందర్భంగా రూఢి అయ్యింది. 166 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రానికి క్లీన్ 'యు' సర్టిఫికెట్ లభించింది.
'దశావతారం' ఆడియో వేడుక ఏప్రిల్ 25న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఎంత ఘనంగా జరిగిందో మనకు తెలుసు. ఆ వేడుకకు జాకీచాన్, అమితాబ్ బచ్చన్, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, మమ్ముట్టి వంటి మహామహులు వచ్చారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేషమియా సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో 5 పాటలున్నాయి. రీ రికార్డింగును మాత్రం దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చాడు. 'దశావతారం'కి కథ, మాటలు, స్క్రీన్‌ప్లేలను కమలహాసన్ స్వయంగా సమకూర్చగా రవివర్మన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. త్యాగరాజన్ స్టంట్స్‌కు రూపకల్పన చేయగా, ఎ. శ్రీకరప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతల్ని నిర్వర్తించాడు. ఇన్ని విశేషాలున్న ఈ సినిమా రేపు విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలు రేకెత్తిస్తుందో చూడాలి. ఏక కాలంలో ఇది తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది.
 

Give your Rating Here :
Average Rating: 3.18    Votes: 116

 
Featured Most Popular
 
 
Movies Actress Actor Events