పవన్ కల్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన 'జల్సా' చిత్రం విడుదలకు రంగం సిద్ధమైంది. 2008లో సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో 'జల్సా' అతి ముఖ్యమైంది. గీతా ఆర్ట్స్ బానర్ మీద అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. సంచలన తార ఇలియానా ప్రధాన నాయికగా నటించిన ఈ చిత్రంలో కమలినీ ముఖర్జీ, పార్వతీ మెల్టన్ ఇతర నాయికలు. 'జల్సా'కు అమిత క్రేజ్ రావడానికి కారణం కాంబినేషనే అని చెప్పాలి. పవన్, ఇలియానా, త్రివిక్రమ్ కలయిక ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజును సృష్టిస్తోంది. 'అతడు' వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందించాడు. 'ఖుషి' అనంతరం హిట్టును చవిచూడని పవన్ కు అతను హిట్టుని అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ ఎలాంటి పాత్రను చేశాడనేది అందరిలోనూ కుతూహలాన్ని రేకెత్తిస్తున్న ప్రశ్న. సంజయ్ అనే జనజీవన స్రవంతిలో కలిసే మాజీ నక్సలైటుగా అతను కనిపించబోతున్నాడని తాజా సమాచారం బట్టి తెలుస్తోంది. ఈ వార్త అందరిలోనూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దానికి సంబంధించిన 'చలోరే చలోరే చల్' అనే పాట ఇప్పటికే బాగా పాపులర్ అయ్యింది. అదొక్కటే కాదు.. సినిమాలోని అన్ని పాటలూ జనం నోట నానుతున్నాయి. 'సరిగమ పదనిస అరే కరో కరో జర జల్సా' అనే టైటిల్ పాట సంగతి అయితే చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటను బాబా సెహగల్ పాడాడు. ఈ పాటల్ని సీతారామశాస్త్రి రాశారు. అందరి నోటా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సింప్లీ రాకింగ్ అనే మాటే. కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ మరో ఎస్సెట్. కాగా పవన్, త్రివిక్రమ్ ల స్నేహితుడు, టాప్ హీరో మహేష్ ఈ సినిమాకు 3 నిమిషాల వాయిస్ ఓవర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఒక టాప్ హీరో సినిమాకు మరో టాప్ హీరో ఇలా వాయిస్ ఇవ్వడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. హీరో పరిచయ సన్నివేశంలోనూ, మధ్య మధ్యలో మహేష్ గొంతు వినిపించనున్నది.
ప్రచారం విషయంలోనూ 'జల్సా' కొత్త పుంతలు తొక్కింది. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన 7.5 అడుగుల చిన్న చిన్న కటౌట్లు వెయ్యిదాకా సినిమా థియేటర్లు, రోడ్ల కూడళ్లు, షాపింగ్ మాల్స్ వద్ద దర్శనమిస్తున్నాయి. అంతేకాదు.. 'జల్సా' మొబైల్ గేమ్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో పవన్, ఇలియానా, ముఖేష్ రుషి కనిపిస్తున్నారు. దీన్నిబట్టి ముఖేష్ రుషి విలన్ పాత్రని చేశాడని తెలుస్తోంది. సునీల్, శివాజీ, పరేష్ రావల్ తదితరులు నటించిన ఈ సినిమాకు కథ, మాటల్ని త్రివిక్రమ్ సమకూర్చాడు. ఈ సినిమాను సుమారు వెయ్యి థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాత అరవింద్ సన్నాహాలు చేస్తున్నారు.
|